శ్లో॥ శాస్త్రం పద్మాసనస్థం శశిధర మకుటం పంచవక్తం త్రినేత్రమ్
శూలంవజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహస్తమ్
నాగంపాశం చ ఘణాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే
నానాలంకారయుక్తం స్పటిక మణి నిభం పార్వతీశం నమామి ||
శ్రీ మెట్టు రామప్ప క్షేత్ర చరిత్ర
శివకేశవుల మధ్య బేధములేదని చాటే అద్వైత మతానికి ప్రత్యక్ష నిలయమైన శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయము వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ కు 2 కి.మీ. దూరములో వరంగల్-హైద్రాబాద్ ప్రధాన రహదారి ప్రక్కన మడికొండ గ్రామ సమీపంలోని అతి పెద్ద గుట్టపైనున్నది. మెట్టుగుట్టగా ప్రసిద్ధిగాంచిన ఈ పుణ్యక్షేత్రాన్ని కాకతీయ ప్రభువులు నిర్మించారు దక్షిణ కాశీగా ప్రఖ్యాతిగాంచిన ఈ క్షేత్రంలో మొదట చాళుక్య రాజులు, శ్రీ వీరభద్ర స్వామి ఆలయము నిర్మించినట్లు చరిత్ర తెలుపుచున్నది.కాకతీయుల కాలంలో ఈ క్షేత్రాన్ని మణిగిరిగా పిలిచేవారు. క్రమంగా అది మారుతూ వచ్చి ప్రస్తుతము మెట్టుగుట్టగా పిలువబడుచున్నది మనోహరమైన పర్వతశ్రేణి పై 55 ఎకరాల స్థలంలో విస్తరించియున్న ఈ గుట్టపై శివకేశవుల ఆలయాలతోపాటు వీరభద్రస్వామి ఆలయం, హనుమంతుని ఆలయం సంతాన వేణుగోపాలస్వామి, నవగ్రహ, అన్నపూర్ణ, గణపతి ఆలయాలున్నాయి.
స్థల పురాణం - క్షేత్ర మహాత్యము
పూర్వము మునులు, సాధువులు, సిద్దులు కైలాసమున కొలువుదీరివున్న శివున్ని దర్శించి భక్తితో స్తోత్రము చేసి ప్రసన్నుని చేసుకొనిరి. కరువు కాటకాలతో, వ్యాధులతో బాధపడుతున్న ప్రజలను కాపాడి ఆధ్యాత్మిక, ఆదిభౌతికాది బాధలను తొలగించుటకు భూలోకమున అవతరించుమని ప్రార్థించారు. వారి అభ్యర్థనకు సంతసించిన పరమశివుడు అభయమిస్తు వారందరిని ఈ సమీప ప్రాంతంలో నివసించుటకు ఆనతిచ్చెను. అచ్చటనే స్వయంభూ లింగముగా వెలుస్తానని, అభిషేకాదులతో ఆర్చించమని సెలవిచ్చెను. కొంతకాలమైన పిమ్మట మాండవయ్య శాండిల్యాది తొమ్మండుగురు సిద్ధులు శివుని గూర్చి తపమాచరించగా పరమశివుడు స్వయంభూవుగా ఈ గుట్టపై వెలిసెను. వనవాసము చేస్తున్న శ్రీరాముడు ఈ ప్రాంతములో విహరించి శివున్ని అభిషేకించాడట. ఆనాటి నుండి ఈ స్వామి శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామిగా వ్యవహరించబడుచున్నాడు. చాలా కాలము తర్వాత ఈ ప్రాంతంలో అనావృష్టి యేర్పడి ఆకలిబాధలు పెరిగాయి. ఒకరోజు రాత్రి తెల్లవారుజామున ఒక శివభక్తునికి శివుడు స్వప్నములో సాక్షాత్కరించి మెట్టుగుట్టపై తాను వెలసిన విధము తెలపి అభిషేకించవలసినదిగా ఆజ్ఞాపించెను. నిద్రనుండి మేల్కొన్న ఆ భక్తుడు ఈ కొండ నెక్కి స్వయంభూః లింగమును కనుగొని భక్తి ప్రపత్తులతో అభిషేకించెను. వెంటనే శుభ సూచకముగా చిరుజల్లు ఒకటి కురిసెనట. ఆ తర్వాతి కాలంలో వర్షాలు కురిసి ప్రజలు సుఖంగా వున్నారట. అది మొదలు ఈ భక్తుడు నిత్యము శివార్చన చేస్తూ చివరకు ముక్తిని పొందెనట. ఆ భక్తుని వంశస్థులే నేటికినీ అర్చకులుగా వ్యవహరిస్తున్నారు. ఆ భక్తునికి ముక్తినిచ్చినందువల్ల ముక్తి లింగముగా కూడా ఇక్కడి స్వయంభూః లింగం ప్రసిద్ధి నొందినది.
అభినవ పోతన బిరుదాంకితులైన వానమామలై వరదాచార్యులవారు మండలము రోజులు మెట్టుగుట్టపై వాగీశ్వరి మంత్రోపాసన చేయగా చదువులతల్లి సరస్వతీ దేవి ప్రత్యక్ష్యమైనది. ఈ సంఘటన 1925 సం||ల జరిగినది. ప్రస్తుతము భక్తులు మెట్టుగుట్టపై శ్రీ శ్రీ శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ ఆలయ నిర్మాణానికి నడుంబిగించారు. రెండవ ప్రోలరాజు కాలమున ఈ ప్రాంతములో నివసించిన త్రిదండి మహాముని కలలో శ్రీరాముడు కనిపించి పూర్వము తాను మెట్టుగుట్టపై విహరించి స్వయంభూఃశివలింగాన్ని అభిషేకించిన విషయమును తెలిపి, ఆలయనిర్మాణమునకు ఆదేశించాడట ఆ ముని ఈ సంగతి చక్రవర్తికి విన్నవించగా అతడు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ నిర్మాణము కావించాడని చరిత్ర చెబుతున్నది. మెట్టుగుట్టపై వున్న నవగుండాలలో పాలగుండము, జీడి గుండము, కన్ను గుండము, కత్తిగుండము, బ్రహ్మగుందము, రామగుండము, గిన్నె గుండము చాలా ప్రసిద్ధమైనవి. పాల గుండాన్ని సర్వరోగ నివారిణిగా, పాపనాశినిగా భక్తులు భావిస్తారు. దీనికి పాతాళ ఊట కలదని అంటారు. జీడి గుండంలో (వరసిద్ధిగుండం) సంతానార్థులైన స్త్రీలు వరసిద్ధి పొందుతారనే నమ్మకం, పాలగుండం నుండి కాశీ వరకు అనుసంధానమున్నదని భక్తులు చెబుతుంటారు. జీడిగుండం ప్రక్కన భీముని పాదముద్రలు కనిపిస్తాయి.
చారిత్రక ప్రాధాన్యము
క్రీ.శ. 950 లో మణిగిరి గ్రామాన్ని ఒకనాడు వేంగీ దేశ చాళుక్య రాజు పెద్దకొడుకగు సుకుమాయుధునాధుడు పరిపాలించినట్లు 'కొరివి' శాసనాల ద్వారా తెలుస్తున్నది. చాళుక్యరాజుల అనంతరము మణిగిరి ప్రాంతము కాకతీయ రాజుల వశమైనది. ఈ ప్రాంతం దట్టమైన అడవులతో నిండివుండేది. ఆనాడు ఓరుగల్లును పాలిస్తున్న కాకతీయ ప్రభువులలో నాల్గవ వాడైన రెండవ ప్రోలరాజు సహకారంతో క్రీ.శ. 1000-1158 మధ్యకాలంలో మెట్టుగుట్టపై శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయాన్ని నిర్మించినట్లు లభించిన ఆధారాల వల్ల తెలుస్తుంది. క్రీ.శ. 1198 నుండి 1261 మధ్య కాలంలో ఓరుగల్లును పాలించిన గణపతిదేవ చక్రవర్తి ఈ కొండపై గల రామాలయంలో విగ్రహాలు నెలకొల్పి శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముందే శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించాడు. శివాలయం గర్భగుడిలోని స్వయంభూః శివలింగము కాశీలోని స్వయంభూః శివలింగము మాదిరిగా వుండి భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ద్వారపాలకుల విగ్రహాలు నాగపాశబద్ధములై చూపరులను ఆకర్షిస్తాయి. గోల్కొండ నవాబు కాలమున సుబేదారుగా వున్న సితాబుఖాన్ శివాలయమునకు 4 ఎకరములు, రామాలయమునకు 36 ఎకరములు తరి, 412 ఎకరములు ఖుష్కి ఇనాముగా ప్రకటించినట్లు 1192 ఫసలీ నటరాజ శాసనము ద్వారా తెలియుచున్నది
దొంతులమ్మ గుండ్లు
మెట్టుగుట్టపై 165 అడుగుల ఎత్తులో రెండు శిఖరాల జంట భక్తులను, పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. భీముడి భార్య హిడింభి గచ్చకాయలు ఆడుకొని వాటిని ఒకదానిపై ఒకటి పేర్చినట్లు ఘటోత్కజుని జననం ఇక్కడే జరిగినట్లు ఒక కథ ఈ ప్రాంతములో ప్రచారంలో నున్నది. ఈ శిఖరాలలోని ఒక శిఖరంలో అయిదు, మరో శిఖరంలో నాలుగు చొప్పున పెద్ద శిలలు ఒకదానిపై ఒకటి పేర్చినట్లుండి సుమారు 15 కి.మీ. దూరం వరకు కనపడతాయి. ఇంతటి ప్రాశస్త్యము కలిగిన మెట్టుగుట్ట పై కార్తీక మాస పూజలు, వరలక్ష్మి పూజలు, శ్రీ గణపతి, దసరా ఉత్సవాలను ప్రతి యేటా వైభవంగా జరుపుతారు. ముఖ్యంగా మహాశివరాత్రినాడు శ్రీ మెట్టు రామలింగేశ్వర స్వామి కళ్యాణము, శ్రీరామనవమి నాడు శ్రీ సీతారామ చంద్రస్వామి కళ్యాణము వైభవంగా జరుపుతారు. ఇక్కడే బమ్మెరపోతనను భిక్షకుడి వేషములో సాక్షాత్తు శ్రీరాముడే వచ్చి భాగవత రచనకు ఘంటమునిచ్చినాడని ప్రసిద్ధి. మెట్టుగుట్ట పుణ్యక్షేత్రము ప్రకృతి సుందర దృశ్యములచే సకల పుణ్య తీర్థములకు ఆలవాలమై శైవ, వైష్ణవ సంప్రదాయ సమన్వయానురూపమై, భక్తులకు కొంగు బంగారమై, ఉత్సవ మహావైభవోపేతమై, లోక కళ్యాణ హేతువై దిన దినాభివృద్ధి నొందుతూ భక్తులను, యాత్రికులను, సందర్శకులను ఆకర్షిస్తూ తరింపజేస్తున్నది. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్ర సందర్శన చేసి తరించండి. ఈ దేవాలయములో స్వామి వారికి ప్రతి దినము శైవాగము ప్రకారముగా పూజా కార్యక్రమాలు నిర్వహించబడును. స్వామి వారికి భక్తుల ద్వారా జరిగే ముఖ్య కార్యక్రమములు వివాహం, సంతానం, దాంపత్య జీవితం, ఆరోగ్యం బాగుండాలని స్వామి వారికి పూజలు నిర్వహిస్తారు అదేవిధంగా ప్రతి సంవత్సరము స్వామి వారి బ్రహ్మోత్సవాలు శైవాగమోక్తంగా పాంచాహ్నిక దీక్షతో అత్యంత వైభవోపేతముగా నిర్వహించబడుచున్నది.
If you like this Post Please Comment and Share your Near and Dear
---------------------------------------------------------------------------------------
If you want for:
Free Astrology, Free Astrology in Telugu, Online Free Astrology,
Online free Astrology in telugu, Prashana Jatakam, Tarabalam and chandrabalam,
Free Horoscope in telugu, Rashipalau, Darma sandehalu,
Vastushastram - Niyamalu and many more Visit Our our Blog and Website
Our Blog: chintamani-free-astrology.blogspot.com
Our Website : www.chintaamani.co.in
Our youtube channal : https://www.youtube.com/c/ChintamaniFreeAstrologyService
Comments
Post a Comment